Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై: ఒక రైలు ఇంజిన్ పై భాగంలో ఒక చిరుత చనిపోయింది. దీనిని గమనించిన రైల్వే అధికారులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఘుగుస్ ప్రాంతంలో గూడ్స్ రైళ్లు ఆగే చోటకు ఒక గూడ్స్ రైలు చేరుకుంది. అయితే ఆ రైలు ఇంజిన్ పై భాగంలో ఒక చిరుత పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. దానిని పరిశీలించగా అది మరణించినట్లు గుర్తించారు. దీంతో రైల్వే అధికారులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు.
కాగా, సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ రైలు ఇంజిన్ వద్దకు చేరుకున్నారు. చనిపోయిన చిరుత కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించారు. పోస్ట్‌మార్టం కోసం పులుల చికిత్సా కేంద్రానికి తరలించారు. రైలు ఇంజిన్‌పైకి చేరుకున్న ఆ చిరుతకు హై టెన్షన్ విద్యుత్ లైన్ తగిలి ఉంటుందని చంద్రపూర్ రేంజ్ అటవీ అధికారి రాహుల్ కరేకర్ తెలిపారు. దీంతో కరెంట్ షాక్ వల్ల అది చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు రైలు ఇంజిన్‌పై చనిపోయి ఉన్న చిరుతకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.