Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే రెండు దఫాలు విచారించింది. మరో విడత విచారణకు ఈ నెల 6న రావాలంటూ నోటీసులు పంపగా, తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అవినాశ్ రెడ్డి బదులిచ్చారు. దాంతో సీబీఐ ఈ నెల 10న రావాలంటూ మళ్లీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి రేపు హైదరాబాదులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని... విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.