Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా బౌలర్లు కీలక సమయంలో పట్టు జారవిడిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఓ దశలో 170 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కష్టాల్లో ఉన్న ఆసీస్ పై ఒత్తిడి పెంచడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దాంతో కుదురుకున్న ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 255 పరుగులు చేసింది.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ సాధించి క్రీజులో ఉన్నాడు. ఎంతో ఓపిక ప్రదర్శించిన ఖవాజా 251 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లతో 104 పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ మెరుగైన సహకారం అందించాడు. చక్కటి ఫుట్ వర్క్ తో టీమిండియా బౌలర్లను ఎదుర్కొన్న గ్రీన్ 64 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 32, తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ 38, పీటర్ హ్యాండ్స్ కోంబ్ 17, మార్నస్ లబుషేన్ 3 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 2, రవిచంద్రన్ అశ్విన్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.