Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పాకిస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. హిందూ డాక్టర్‌పై కారు డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఆయన గొంతు కోసి హత్య చేశాడు. పాకిస్థాన్ సింధు ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరంలో ఈ సంఘటన జరిగింది. డాక్టర్ ధరమ్ దేవ్ రాతి స్థానికంగా ప్రసిద్ధి చెందిన చర్మవ్యాధుల వైద్యుడు. మంగళవారం కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి చేరిన వెంటనే కారు డ్రైవర్ కిచెన్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కత్తిని తీసుకుని ఆ డాక్టర్‌పై దాడి చేశాడు. ధరమ్ దేవ్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం డాక్టర్‌కు చెందిన కారులో అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, కిచెన్‌లో ఉన్న వంట వ్యక్తి ఇది చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితుడైన కారు డ్రైవర్‌ను హనీఫ్ లెఘారీగా గుర్తించారు. ఖైర్పూర్లోని అతడి ఇంట్లో బుధవారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి జియాన్ చంద్ ఎస్సారానీ ఈ సంఘటనను ఖండించారు. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులను ప్రశంసించారు. బాధిత హిందూ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మహిళా విభాగం చీఫ్ ఫర్యాల్ తల్పూర్ కూడా హిందూ డాక్టర్ హత్యను ఖండించారు. పాకిస్థాన్‌లోని హిందువులు హోలీ వేడుక జరుపుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరుగడం బాధాకరమని అన్నారు. హిందూ డాక్టర్ ధరమ్ దేవ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.