Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియాకు వివరించారు. ‘గతంలో మొదటి దఫాలో గొర్రెల పంపిణీ పూర్తిగా జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇందులో 50శాతం పంపిణీ గతంలో పూర్తయ్యింది. మిగతా 50శాతం మందికి గొర్రెల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్, కేబినెట్ నిర్ణయించి, రూ.4,463కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీ ఏప్రిల్ నెలలో ప్రారంభించి.. ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 7.31లక్షల యూనిట్లలో గతంలోనే యూనిట్లు మంజూరవగా.. మిగతా లబ్ధిదారులందరికీ ఆగస్టు నాటికి పంపిణీ చేస్తాం. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని నిర్ణయించింది. పారదర్శకంగా, వేగవంతంగా కార్యక్రమం పూర్తి చేయాలని కేబినెట్ అభిప్రాయపడింది’ అని హరీశ్‌రావు వివరించారు.