Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
సీఎం జగన్ చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి శుక్రవారం హైదరాబాదు కోఠిలోని సీబీఐ విచారణకు మూడోసారి హాజరు కానున్నారు. వివేకా హత్య కేసులో కీలక సూత్రధారుల గుట్టు రట్టు చేసేందుకు అవినాశ్‌ను జనవరి 28న ఒకసారి, ఫిబ్రవరి 24న రెండోసారి సీబీఐ విచారించింది. ఇదే కేసులో అవినాశ్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా కడప సెంట్రల్ జైలు ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో 12వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. కాగా.. తండ్రీకొడుకులు ఇద్దరినీ ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని సీబీఐ మొదట నోటీసులు ఇచ్చింది. ఆ రోజు తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వలన రాలేనని అవినాశ్‌రెడ్డి సీబీఐకి లేఖ రాయడంతో ఆయన విచారణను తిరిగి ఈనెల 10వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తనకు 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంత చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్లో కోరారు. ఇప్పుడీ వ్యవహారం ఆసక్తిగా మారింది.