Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇండోనేషియా
గత ఏడాది ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన ప్రమాదంలో వందమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన స్టేడియం తొక్కిసలాట కేసులో ఆ దేశ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రమాదానికి కారణమైన ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. మ్యాచ్ అధికారి అబ్దుల్ హ్యారిస్‌కు 18 నెలలు, భద్రతా అధికారి సుకో సుత్రిస్నోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ‘వీళ్ల ఇద్దరి నిర్లక్ష్యం కారణంగానే అంతమంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు’ అని జడ్జి అబు అచ్మంద్ సిద్దిఖీ హంస్య అన్నాడు.
ఈ విషాద ఘటనతో ప్రమేయం ఉన్న ముగ్గురు పోలీసులపై కూడా కేసు నమోదు చేశారు. వీళ్లపై మరికొద్ది రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు. హ్యారిస్, సుకోలు అరెమా ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందినవాళ్లు. ప్రమాద అనంతరం ప్రజాగ్రహం పెల్లుబికడంతో ఈ ఇద్దరినీ ఫుట్‌బాల్ సంబంధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేశారు. వీళ్లపై ఇండోనేషియా ఫుట్‌బాల్ సమాఖ్య ఇప్పటికే జీవితకాల నిషేధం విధించింది.