Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఖర్చులు రూ.80 కోట్లు అని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తీసి మీ ముఖాన కొడతాం అని సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. మిత్రుడు భరద్వాజ్ కు అంటూ ఓ సందేశం వెలువరించారు. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలని రాఘవేంద్రరావు హితవు పలికారు. అంతేకానీ, 80 కోట్లు ఖర్చు అనడం సరికాదని, అయినా రూ.80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర ఏదైనా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉందా? అంటూ తమ్మారెడ్డిని నిలదీశారు. ఒకవేళ జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అని రాఘవేంద్రరావు ప్రశ్నించారు.
అటు, మెగాబ్రదర్ నాగబాబు అంతకంటే ఘాటుగా స్పందించారు. ఇది ఎవరికి తగిలితే వారికి అంటూ రాయడానికి వీల్లేని భాషలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రాకెట్లో ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం అని చురక అంటించారు.