Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘విజయ డెయిరీ’ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పలు రకాల కుంభకోణాలతో సంస్థ పరిస్థితి దారుణంగా ఉంది. పాల అమ్మకాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. నిర్వహణ ఖర్చులు సరైన సమయంలో విడుదల కాకపోవటంతో రోజువారీ కార్యక్రమాలకూ ఇబ్బందికరంగా ఉంది. నిత్యం పాల అమ్మకాలు జరుపుతున్న పంపిణీదారులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు సుమారు రూ.23 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెండింగు బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. మరో వైపు రూ.30 లక్షల పాల అమ్మకాలకు సంబంధించిన రికార్డులు మాయం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పాల పరిధిలో పాల అమ్మకాల కోసం పంపిణీదారులుగా రెండు ఏజెన్సీలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నియమించింది. వీటికి లీటరుకు రూ.7 కమీషన్ చెల్లిస్తారు. అమ్మకాల పద్ధతి(క్యాష్ అండ్ క్యారీ)లో ఏరోజు డబ్బులు అదేరోజు చెల్లించి డెయిరీల నుంచి పాలు తీసుకెళ్లాలి. స్థానిక మార్కెట్‌తో పాటు ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా సరఫరా చేస్తారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా, పేరుకుపోయిన పాల అమ్మకాల బకాయిలు, రోజువారీ పద్ధతిలో చెల్లించేందుకు మొండికేస్తున్నారు. దీంతో బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. ఖమ్మంలో పంపిణీ చేసే ఏజెన్సీ రూ.23 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.3 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.