Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైపూర్
పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల భార్యలు జైపూర్లోని సచిన్ పైలట్ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం దీక్షను భగ్నం చేసి స్థానిక స్టేషన్కు తరలించారు పోలీసులు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్కు తరలించారు. అరెస్ట్ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా సచిన్ పైలట్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్ డీజీపీ లేఖ రాసి ఘటనపై వివరణ కోరింది.