Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేస్తూ ఓ మహిళ రూ. 60,000 నష్టపోయారు. ఢిల్లీలోని దరియాగంజ్కు చెందిన టీవీ ప్రొడ్యూసర్ తబస్సుమ్ ఖురేషి గత ఏడాది డిసెంబర్ 29న ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకున్నారు. గూగుల్లో డాక్టర్ క్లినిక్ నెంబర్ను తెలుసుకున్న ఆమె ఆ నెంబర్కు కాల్ చేయగా కనెక్ట్ కాలేదు. ఆపై కొద్దినిమిషాల తర్వాత ఆమె మొబైల్ నెంబర్కు గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తి తాను స్టాఫ్ మెంబర్గా పరిచయం చేసుకున్నాడు. ఆమెకు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసేందుకు సాయపడతానని నమ్మబలికాడు. ఆపై ముందుగా అనాధ బాలల కోసం రూ . 5 విరాళం ఇవ్వాలని పేమెంట్ లింక్ పంపాడు. ముందు పేమెంట్ ఫెయిల్ కావడంతో ఆమె వదిన ఫోన్ నెంబర్ నుంచి ప్రయత్నించినా పేమెంట్ సక్సెస్ కాలేదు. అయితే కొద్దిసేపటికే ఆమె ఖాతా నుంచి రూ. 51,900 డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది. మరికొద్దిసేపటికి తన తల్లి ఖాతా నుంచి రూ. 10,000 డెబిట్ అయినట్టు మరో మెసేజ్ రావడంతో తబస్సుమ్ ఖరేషి మోసపోయినట్టు గుర్తించింది. తబస్సుమ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖురేషిని సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ ఫ్రాడ్, సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్ ద్వారా బురిడీ కొట్టించినట్టు పోలీసులు భావిస్తున్నారు.