Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర ప్రదేశ్
అపార్ట్మెంట్లోని బాత్రూమ్లో ఓ జంట అనుమానాస్పదంగా మృత్యువాతపడింది. హోలీ అనంతరం స్నానం కోసం వెళ్లిన దంపతులు బాత్రూమ్లో శవమై కనిపించారు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లా మురాద్నగర్ పట్టణంలోని అగ్రసేన్ మార్కెట్ సమీపంలో చోటుచేసుకుంది. మృతిచెందిన దంపతులను దీప్కా గోయల్ (40), అతని భార్య శిల్పి (36)గా గుర్తించారు.
గోయల్, శిల్పి గురువారం ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రంగులు కడుక్కొని, స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లిన జంట తిరిగి బయటకు రాలేదు. అనుమానించిన కుటుంబ సభ్యులు బలవంతంగా బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా.. ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే దంపతులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే బాత్రూమ్లో సరైన వెంటిలేషన్ లేకపోవడం, గీజర్ నుంచి వెలువడే విష వాయువుల వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇళ్లంతా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని తెలిపారు.