Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వారం రోజుల్లో కొలువులో చేరాల్సి ఉంది. అంతలోపే ఓ యువకుడు.. గుండెపోటుతో మరణించాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు గ్రామానికి చెందిన కొట్టే పెద్దకృష్ణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. రెక్కల కష్టంపై బతికే ఆ దంపతులు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశారు. ఒక్కగానొక్క కుమారుడైన కొట్టే మురళీకృష్ణ(26)ను కష్టపడి చదివించారు. బీటెక్ చదివిన మురళీకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఇటీవలనే మురళీకృష్ణకు హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ కొలువు వచ్చింది. ఈ నెల 17న ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉంది. దీంతో కొన్ని రోజుల క్రితమే ఎంతో సంతోషంగా సొంతూరికి వచ్చిన ఆయన.. అమ్మానాన్నలకు శుభవార్త చెప్పి ఆనందం పంచుకున్నారు. ఇక తమ కష్టాలు తొలిగిపోయాయని, అందరి బాధ్యతా తానే తీసుకుంటానని చెప్పి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న మురళీకృష్ణ గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. కష్టకాలంలో కొలువు వచ్చినందుకు తల్లిదండ్రులూ పొంగిపోయారు. సరదాగా సినిమా చూస్తున్నవాడు చూస్తున్నట్టే హఠాత్తుగా పడిపోయాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటాడని అనుకుంటే తమను వదిలిపోయాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలిచివేశాయి. నక్కలగరుబు గ్రామంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.