Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ - గంగాధర
ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం గంగాధర మండలం కురిక్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కొలిపాక మల్లేశం అనే వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆస్పత్రిలో చికిత్స పొందతూ నేరెళ్ల సత్తయ్య ప్రాణం వదిలారు.
గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల సత్తయ్య (55) అనే వ్యక్తి చొప్పదండి మండలం చాకుంటలో జరిగిన తన మనవరాలు 21వ రోజు ఫంక్షన్ కు వెళ్లి స్వగ్రామం వస్తుండగా, రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి చెందిన కొలిపాక మల్లేశం (56) అనే వ్యక్తి సిరిసిల్ల వెళ్లి స్వగ్రామం వెళ్తున్నాడు. ఫ్యాషన్ ప్రో పై వస్తున్న సత్తయ్య టీవీఎస్ బైక్ పై వెళ్తున్న మల్లేశం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నారు. ఈ దుర్ఘటంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మృత్యుఒడికి చేరగా, మృతుడు మల్లేశం కుమారుడు శ్రీకాంత్ (32) తీవ్రంగా గాయపడ్డాడు. నేరెళ్ల సత్తయ్య గీతాకార్మికుడిగా పని చేస్తూ జీవిస్తుండగా, మల్లేశం హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. మృతులిరువురికి భార్యలు, పిల్లలు ఉన్నారు. బైకులు ఢీకొన్న దుర్ఘటంలో ఇద్దరు మరణించడంతో ఆయా గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. గంగార పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.