Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
చట్టబద్ధ కరెన్సీకి అదనంగా తీసుకొస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (ఇ-రూపీ) ప్రయోగాలు దేశంలో కొనసాగుతున్నాయి. రిటైల్, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న ఈ కరెన్సీ విలువ ప్రస్తుతం రూ.130 కోట్లపైనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫిబ్రవరి 28 నాటికి రిటైల్ డిజిటల్ రూపాయలు రూ.4.14 కోట్లు, హోల్సేల్ రూ.126.27 కోట్లు చొప్పున చలామణీలో ఉన్నాయని లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపాయిని గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నవంబర్ 1న హోల్సేల్ విభాగంలో, డిసెంబర్ 1 నుంచి రిటైల్ విభాగంలో దీని ప్రయోగాలు ప్రారంభించింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రయివేటు బ్యాంకులు కలిపి మొత్తం 9 బ్యాంకులు హోల్సేల్ పైలట్ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థలు సైతం ఉన్నాయన్నారు. ప్రయోగాల్లో భాగంగా సాంకేతిక పనితీరు, డిజైన్ గురించి తెలుసుకుంటున్నామని, వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఇ-రూపీని దశలవారీగా విస్తరించే అంశంపై దృష్టి సారించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.