Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వారిలో మనోధైర్యాన్ని నింపాలని కోరారు.
రాష్ట్రంలో మార్చి 15 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడీయట్ పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ల ద్వారా వారికి మోటివేషన్ ఇప్పించి పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.