Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. “ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా?” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు చేపట్టాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకి నోటీసులు కూడా ఇచ్చింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే తాజాగా ఈ నోటీసులపై స్పందించారు బండి సంజయ్. కమిషన్ ఆయనను ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొనగా.. రేపు రాలేనని, ఈనెల 18న విచారణకు హాజరవుతానని కమిషన్ కు లేఖ రాశారు. ఆయన లేఖ పై మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.