Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. రాజస్థాన్‌లో 200, మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. భోపాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ తమ పార్టీ అంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి భయమని కేజ్రీవాల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిన తీరును కేజ్రీవాల్ తప్పుబట్టారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూరగాయల మార్కెట్‌గా మార్చారని కేజ్రీవాల్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారంటూ ఆయన సీఎం శివరాజ్‌సింగ్ పాలనపై విమర్శలు చేశారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ను తాము గెలిచామని త్వరలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ సత్తాచాటుతామని కేజ్రీవాల్ చెప్పారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాదిత్య సింధియా మద్దతుతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఎన్నికలు జరిగిన గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 182 స్థానాలకు పోటీ చేసి కేవలం 5 చోట్ల గెలుపొందింది. 120 చోట్ల ఆప్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అయితే ఆప్‌కు 13 శాతం ఓటింగ్ లభించింది. ఆప్ ఈసారి కర్ణాటకలోనూ పోటీ చేయబోతోంది.