Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 13వ ఎడిషన్ మెగా బాక్సింగ్ టోర్నీ బుధవారం అంగరంగ వైభవంగా మొదలైంది. అతిరథ మహారథుల సమక్షంలో వివిధ దేశాలకు చెందిన బాక్సర్లు జాతీయ జెండాలను చేబూని వేదికపైకి విచ్చేసారు. భారత్ తరఫున స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై మువ్వన్నెల జెండాతో అలరించారు. మూడోసారి భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 300 మందికి పైగా బాక్సర్లు పోటీపడుతున్నారు. ఆతిథ్య భారత్ తరఫున 12 మంది బాక్సర్లు సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై కచ్చితంగా పతకాలు గెలుస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని తమ విభాగాలను మార్చుకున్న నిఖత్(50కి), లవ్లీనా(75కి) ఏ మేరకు రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. దిగ్గజ బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీకోమ్ గాయం కారణంగా ఈసారి మెగాటోర్నీకి పూర్తిగా దూరమైంది.