Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మొదటిరోజు ఇంటర్ ఫస్టియర్ సెంకడ్ లాంగ్వేజీ పరీక్షలు జరిగాయి. పరీక్ష రాసేందుకు పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు. చాలా మంది వివిధ కారణాలతో ఎగ్జాం సెంటర్లకు సకాలంలో చేరుకోలేక పరీక్ష రాయలేకపోయారు. బిడ్డ కాలు విరగడంతో ఆమెను భుజాలపై రెండో అంతస్తుపైకి మోసుకెళ్లి పరీక్ష రాయించాడో తండ్రి. మెదక్ పట్టణానికి చెందిన ఇంటర్ స్టూడెంట్ శ్రీవర్ష కాలు విరిగింది. టీఎస్ఎస్ఆర్డబ్ల్యూజేసీలో ఎగ్జామ్ సెంటర్ ఉండటంతో తండ్రి వెంకటేశం పొద్దున్నే ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. పరీక్షా కేంద్రం రోడ్డు నుంచి అర కిలో మీటర్ దూరం లోపలికి ఉండటంతో వీల్‌చైర్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరాడు. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక రోడ్డు నుంచి ఎగ్జామ్ సెంటర్ దాకా భుజాలపై మోసుకెళ్లాడు. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు ముందు అనుమతివ్వలేదు. ఇందుకోసం స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఆ తర్వాత పంపించడంతో రెండు అంతస్తులపైకి మోసుకెళ్లి శ్రీవర్షను హాల్లో దింపాడు.
ఇదే క్రమంలోనే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియక గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. కొండాపురానికి చెందిన కొండా వినయ్ ఖమ్మంలోని ఆర్జేసీ కాలేజీలో చదువుతున్నాడు. అదే సిటీలోని ఎన్ఎస్పీ ప్రభుత్వ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అదెక్కడో తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్‌లో నావిగేషన్ పెట్టుకుని బయల్దేరాడు. అది మరో లొకేషన్‌కు తీసుకెళ్లింది. అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ తన అసలు సెంటర్‌కు చేరుకున్నాడు. 27 నిమిషాలు లేట్ కావడంతో ఎగ్జామ్ రాసేందుకు అనుమతివ్వలేదు.