Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భార్య అక్షతామూర్తి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓ పార్క్‌కు వెళ్లిన ఆయన.. అక్కడి నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో పోలీసులు సునాక్‌కు నిబంధనలు గుర్తు చేయాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైంది. సునాక్ కుటుంబం లండన్‌లోని హైడ్ పార్క్‌కు వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు తమ పెంపుడు శునకం ‘నోవా’ను కూడా తీసుకెళ్లారు. అక్కడి సెర్పెంటైన్ సరస్సు సమీపంలో నడుస్తున్నప్పుడు నోవాను స్వేచ్ఛగా వదిలేశారు. ఆ పార్క్‌లో కుక్కలకు బెల్టు కట్టకుండా తిప్పడం నిబంధనలకు విరుద్ధం. ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ అక్కడ సూచిక బోర్డు ఉన్నా సునాక్ కుటుంబం దాన్ని పాటించలేదు. దీన్ని గమనించిన సునాక్ భద్రతా దళంలోని ఓ పోలీసు అధికారి ఆయనకు పార్కు నిబంధనల గురించి గుర్తు చేశారు. వెంటనే సునాక్ కుటుంబ సభ్యులు శునకానికి బెల్టు కట్టారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సునాక్ క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సునాక్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారేం కాదు. రెండు నెలల క్రితం ఆయన కారులో సీట్ బెల్టు పెట్టుకోకుండా వెళ్లినందుకు పోలీసులు జరిమానా విధించారు. ఆ సమయంలో సునాక్ క్షమాపణలు చెప్పారు.