Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాకినాడ: కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కాకినాడలోని దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలో వ్యాన్‌పై పెంటా వెంకట దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా అతడి వద్దకు అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నారావు వెళ్లారు. వ్యాన్ రికార్డులు, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలను ఆయన అడిగారు. వాహనానికి ఇది వరకే పడిన జరిమానా కట్టాలని సూచించారు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్.. తన వద్ద ఉన్న కత్తితో చిన్నారావును తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో రవాణా శాఖ అధికారి చేతి బొటనవేలు తెగింది. వెంటనే ఆయన్ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రవాణాశాఖ అధికారిపై దాడి చేసిన దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.