Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలని ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు. నిద్ర తగ్గితే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని, పని మీద ప్రభావం పడుతుందని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ లోని బస్ భవన్ లో 'వరల్డ్ స్లీప్ డే (అంతర్జాతీయ నిద్ర దినోత్సవం)' సందర్భంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తో కలిసి వరల్డ్ స్లీప్ డే థీమ్ ను సజ్జనార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... కరోనా తర్వాత నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. సరిపడా నిద్ర లేకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయని చెప్పారు. నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందని.. వాటి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. నిద్రకు ఉన్న ప్రాధాన్యతతో పాటు ఆరోగ్య సమస్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు.
డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ... నిద్రలేమి వల్ల బీపీ, డిప్రెషన్, గుండె సమస్యల వంటివి వస్తాయని తెలిపారు. వ్యాయామం చేస్తే చాలు ఆరోగ్యంగా ఉంటామని అనుకోవడం సరికాదని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకుని సమయానికి నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.