Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందన్నారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహణ లేకుండా, బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలవకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం.. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టీఎస్పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అబాసు పాలై, పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారు. అయినా బండి సంజయ్ కు బుద్ది రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.