Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయన అరెస్ట్ కోసం జారీ చేసిన వారెంట్‌ను కోర్టు శుక్రవారం సస్పెండ్ చేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గనున్నాయి. అరెస్ట్ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న ఆయన ఇక స్వేచ్ఛగా బయటకు రానున్నారు. ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది అవిశ్వాస ఓటు ద్వారా ప్రధాని పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్‌ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అందుకున్న బహుమతులను వేలం వేయడం ద్వారా పొందిన సంపాదనను వెల్లడించలేదని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (పీఈసీ) ఆరోపించింది. పీఈసీ దాఖలు చేసిన కేసు విచారణ కోసం ఇస్లామాబాద్ కోర్టుకు ఆయన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా లాహోర్‌లోని తన ఇంట్లోనే ఉన్నారు. ఆయన పార్టీ అయిన పీటీఐ మద్దతుదారులు ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో కాపాలాగా ఉన్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పలుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన మద్దతుదారులు అడ్డుకోవడం వల్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు.