Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రాజశేఖర్ సమీప బంధువులిద్దరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్-1 ప్రాథమిక పరీక్షకు హాజరైనట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి వచ్చి గ్రూప్స్ రాసిన తీరుపై స్థానికంగా చర్చ సాగుతోంది. వీరిద్దరు గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలో అర్హత సైతం సాధించినట్లు స్థానికులు చెబుతున్నారు. వారి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ 2012లో ఉపాధి కోసం అఫ్గానిస్థాన్ వెళ్లి 2016లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కంప్యూటర్ హార్డ్వేర్పై పట్టున్న ఇతను కొన్నాళ్లు హైదరాబాద్‌లోని పలు కంప్యూటర్ విభాగాల్లో అడ్మిన్‌గా కీలక బాధ్యతల్ని నిర్వర్తించినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన దగ్గరి బంధువుల ద్వారా టీఎస్పీఎస్సీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరినట్లు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం వచ్చిన తరువాతే ఊరిలో కొత్త భవనాన్ని నిర్మించుకున్నాడని పేర్కొంటున్నారు. గ్రామానికి వచ్చిన సమయంలో కొంతమంది సన్నిహితులతోనే ఉండేవాడని.. జీతం రూ.లక్షల్లో వస్తుందనుకునేవారమని గ్రామస్థులు చెబుతున్నారు.