Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హేగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఉక్రెయిన్ యుద్ధ నేరాలపై ఆయనకు శుక్రవారం ఈ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉక్రెయిన్‌లోని పిల్లల్ని చట్టవ్యతిరేకంగా డిపోర్ట్ చేసినట్లు పుతిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేగ్‌లోని ఐసీసీ.. రష్యాకు చెందిన చిల్డ్రన్ రైట్స్ కమీషనర్ మారియా లోవా బెలోవాకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన ఆ ఆదేశాలను రష్యా అధికారులు కొట్టిపారేశారు. ఐసీసీలో రష్యాకు భాగస్వామ్యం లేదని అన్నారు. కానీ ఐసీసీ ఇచ్చిన తీర్పును ఉక్రెయిన్ స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమని జెలెన్స్కీ అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 16 వేల మంది చిన్నారుల్ని అక్రమ రీతిలో రష్యాకు డిపోర్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఒకవేళ పుతిన్ ఏదైనా ఐసీసీ సభ్య దేశంలో అడుగుపెడితే, అప్పుడు అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్‌ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఐసీసీ ప్రెసిడెంట్ పియోటర్ హాఫ్మన్స్కీ తెలిపారు.