Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టిన రష్యా.. అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తీర ప్రాంతమైన మేరియుపోల్‌నూ పూర్తిగా నాశనం చేసింది. మరుభూమిగా మారిన ఆ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసిన తర్వాత ఆక్రమిత భూభాగాల్లో పుతిన్ పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా క్షిపణి దాడులు చేస్తోన్న సమయంలోనే పుతిన్ మేరియుపోల్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మేరియుపోల్‌కు హెలికాప్టర్లో వెళ్లిన పుతిన్.. నగరంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. అంతేకాకుండా అక్కడక్కడ ఆగుతూ స్థానికులతో మాట్లాడినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులు మొదలుపెట్టిన తర్వాత తొలిసారి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పుతిన్ పర్యటించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో ఆక్రమించుకున్న క్రిమియాలో ఇటీవల ఆకస్మిక పర్యటన చేశారు. రష్యాలో ఈ ప్రాంతం విలీనమై తొమ్మిదేళ్లయిన సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఒక బాలల కేంద్రాన్ని సందర్శించారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించారంటూ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసింది. అయితే భద్రతా కారణాలరీత్యా క్రిమియాను తమ ఆధీనంలో ఉంచుకోవడం అనివార్యమని పుతిన్ చెబుతున్నారు.