Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్: ఒక పోలీస్ కానిస్టేబుల్ రూ.3,000 లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆయనను ప్రత్యేక గదిలో ప్రశ్నిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయాడు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిల్లావర్ ప్రాంతానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్, కథువాలోని మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000లు లంచంగా తీసుకున్నాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో అతడ్ని ప్రశ్నించారు. కాగా, తనకు ఛాతిలో అసౌకర్యంగా ఉందని హెడ్ కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ తెలిపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కిరణ్ దేవి తెలిపారు. దీంతో ఆయనను వెంటనే ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే చికిత్స పొందుతూ అక్కడ చనిపోయాడని వెల్లడించారు. కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ మృతికి కారణం ఏమిటన్నది తెలియలేదని అన్నారు.