Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్: ఒక చిరుత పాకిస్థాన్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. గమనించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) స్థానిక గ్రామస్తులను అప్రమత్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఒక చిరుత రామ్‌గఢ్ సబ్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్‌ను దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని గమనించారు. సరిహద్దు సమీపంలోని స్థానికులను అలెర్ట్ చేశారు. ఆ చిరుత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. భారత్ భూభాగంలోకి చిరుత చొరబడిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో బీఎస్ఎఫ్ షేర్ చేసింది. ఇది చాలా అరుదైన ‘చొరబాటు’ సంఘటన అని పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి చిరుత ప్రవేశించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు వెరైటీగా స్పందించారు. దేశంలోకి కొత్తగా చొరబడిన చిరుతకు కొందరు ఫన్నీగా స్వాగతం పలికారు. ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను భారత్ దిగుమతి చేసుకుంటున్న తరుణంలో ‘ఇలాంటి చొరబాట్లను స్వాగతించాలని’ ఒకరు పేర్కొన్నారు. అయితే ఇలాంటి చొరబాటును భద్రతా సిబ్బంది అనుమతిస్తారా? అని మరొకరు ఫన్నీగా ప్రశ్నించారు.