Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో కాలినడకన రావడంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆదివారం ఉదయం నుండి లింగ దర్శనం ఉండదని కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో లవన్న స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్దం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏప్పటికప్పుడు వాటిపై శ్రద్ద కనబరచాలని అదికారులను ఈవో లవన్న ఆదేశించారు. భక్తులందరూ శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తిగా దర్శించుకునేందుకు తెల్లవారుజామున మూడు గంటలనుండి అర్దరాత్రి వరకు మూడు క్యూలైన్లలో ఉచిత, శ్రీఘ్ర, అతి శ్రీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వృద్దమల్లికార్జునస్వామికి అభిషేకాలు, స్వామి అమ్మవార్ల నిత్యకళ్యాణం, వల్లిదేవసేన కళ్యాణం, ఆర్జిత సేవా కర్తలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన ఆశీర్వచన మండపంలోనే ఉంటుందని భక్తులందరూ సహకరించాలని కోరారు. ఆలయం తెరిచినప్పటి నుండి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదం అందుబాటులో ఉంచారు. కాలినడక భక్తులకు మార్గమధ్యలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, మంచినీరందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. కాలి నడక భక్తులకు ప్రత్యేక కంకణాలను ఏర్పాటు చేసి శ్రీఘ్ర దర్శనం ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. అటవీ ప్రాంతం నుండి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం దవాఖానలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.