Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. రైతుల సమస్యలపై రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే 22న తిరుమలగిరి మండలంలో నిరాహార దీక్షకు కూర్చొంటానని హెచ్చరించారు. అకాల వర్షం, వడగళ్ల వాన అన్నదాతల ఆశలను చిదిమేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వానతో అన్నదాత తీవ్రంగా నష్టపోయారన్నారు. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్న కోమటిరెడ్డి... రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. అకాల వర్షానికి నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేవరకు తన పోరాటం ఆగదని వెల్లడించారు. తక్షణమే పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకునే ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయని, వరి, మిరప, టమాట, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.