Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 518 పాయింట్ల నష్టంతో 57,471 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 16,940 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 82.49 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హెచ్‌యూఎల్ మాత్రమే లాభాల్లో ఉంది. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
అమెరికా, చైనా, ఇంగ్లాండ్ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు ఈ వారం కీలకం కానున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్, క్రెడిట్ సూయిజ్ తాజా పరిణామాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈ బ్యాంకులు కోలుకునేందుకు తీసుకునే చర్యలు ప్రభావం చూపొచ్చు. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల పెంపులు, అంతర్జాతీయ వృద్ధి భయాలతో మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ సంక్షోభంపై అమెరికా ఫెడ్ చేసే వ్యాఖ్యలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. యూఎస్ ఫ్యూచర్స్ ప్రస్తుతం సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.