Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ప్రతినిధులు పరామర్శించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. పార్టీ నేతలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని రైతులకు భరోసా ఇచ్చేలా వారితో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతంపై దృష్టి సారించాలని వర్షకాలంలోపు పనులయ్యేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 29వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇస్తున్న సందేశాన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలని, పార్టీ శ్రేణుల ప్రాధాన్యత, రాష్ట్ర ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన ముఖచిత్రం వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతి కార్యకర్తకూ అర్థమయ్యేలా వివరించాలని కేటీఆర్ తెలిపారు.