Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 10 బిల్లులను ఆమోదించలేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం పంపిన ఆ బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు పిటిషన్లో కోరింది. ఇందుకు సంబంధించి తెలంగాణ గవర్నర్కు నోటీసులు జారీ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తొలుత సిద్దపడడంతో గవర్నర్కు నోటీసులు ఇవ్వవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు.
గవర్నర్కు, కేంద్రానికి నోటీసులు ఇస్తే అది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందని, గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న బిల్లులలో కొన్నింటిని కొద్ది రోజుల క్రితమే పంపారని అసలు విషయం ఏమిటో తెలుసుకొని కోర్టుకు నివేదిస్తానని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సోమవారం కల్లా కోర్టుకు వివరాలు చెప్పాలని సీజేఐ చంద్రచూడ్ సూచించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.