Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇన్ఫ్లుయెంజా భయాల వేళ దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కొవిడ్ బాధితుల చికిత్సకు కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. కొవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తేనే యాంటీబయాటిక్స్ చికిత్సలో ఉపయోగించాలని వైద్యులకు సూచించింది. అంతేగాక, అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.
ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కొవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు క్లినికల్‌గా లక్షణాలు కన్పిస్తేనే యాంటీబయాటిక్స్‌ను వాడాలి. లేదంటే వాటి అవసరం లేదు. పినవిర్-రిటోనవిర్, హైడ్రోక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరావిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ వంటివి కొవిడ్ చికిత్సలో ఉపయోగించకూడదు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదురోజుల పాటు రెమిడెసివిర్ ఇవ్వొచ్చు' అని కేంద్రం ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు నమోదవ్వగా.. సోమవారం 918 కొత్త కేసులు వెలుగుచూశాయి. అటు యాక్టివ్ కేసులు కూడా 6,350కి చేరాయి.