Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. బీహార్ లో ఫోన్ మాట్లాడుతూ వీధిలో నిల్చున్న మహిళను ఓ వ్యక్తి హఠాత్తుగా ముద్దు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది. అతడు అదే విధంగా మరికొందరు మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అతడి పేరు మహ్మద్ అక్రమ్. అతడిని బీహార్ లో సీరియల్ కిస్సర్ గా పిలుస్తున్నారు. అతడి ఉన్మాద చర్యలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మహ్మద్ అక్రమ్ ఓ ముఠాకు నాయకుడని తెలిసింది. మహిళలను వేధించడం, చోరీలు ఈ ముఠాకు నిత్యకృత్యాలు.
పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు... మహ్మద్ అక్రమ్ తో పాటు నలుగురు ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను వెంటాడుతూ వెళ్లి బలవంతంగా ముద్దుపెట్టుకోవడం వీరి నైజం. బీహార్ లోని జమూయ్ జిల్లాలో ఓ మహిళను ఇలాగే ముద్దుపెట్టుకున్న ఘటన మార్చి 13న వెలుగులోకి వచ్చింది.