Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన సంభారపు అరుణ్, రీతూ దంపతులు హైదరాబాద్లోని హస్తినాపురం వద్ద హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నల్లవెల్లి సుందర్ హైదరాబాద్లో ఆటో నడుపుతూ భార్య రాధికతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం వారు తమ స్వగ్రామంలోని చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చారు. సాయంత్రం అరుణ్ భార్యతో కలిసి కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. అయితే నల్లవెల్లి సుందర్ తన భార్య రాధిక, పిల్లలు శ్యామ్(5), బ్లెస్సీలను అరుణ్ కారులో ఎక్కించి, తాను బైక్పై వెళ్లాడు. కారు యాచారం మండలం పాత మాల్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అరుణ్ భార్య రీతూ (22), సుందర్ కుమారుడు నల్లవెల్లి శ్యామ్(5) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు కాగా, చిన్నారి బ్లెస్సీ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని యశోదకు, మిగతా వారిని ఇతర దవాఖానాలకు తరలించారు.
అరుణ్ భార్య రీతూ(22) ప్రస్తుతం నిండు గర్భిణి. మరో 10 రోజుల్లో ఆమె డెలివరీ కోసం డాక్టర్లు టైం ఇచ్చారు. ఆమె కడుపులో కవలలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో రీతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.