Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంటు మొదటి అంతస్థులో ఆందోళనకు దిగారు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్, ఆర్థిక మోసాలు వంటి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జేపీసీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 'వుయ్ వాంట్ జేపీసీ' అని ప్లకార్డులు ధరించి, నినాదాలు చేశారు. పార్లమెంటు ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖ వద్ద ప్రతిపక్ష ఎంపీల నిరసన కార్యక్రమం జరిగింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఎస్బీఐ తీవ్రంగా దెబ్బతిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ పట్ల బీజేపీ సానుకూల వైఖరిని అవలంబిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్టుల కేటాయింపులో ఆ కంపెనీల పట్ల అనేకసార్లు సానుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సహా దాదాపు 10 ప్రతిపక్ష పార్టీలు గత వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశాయి.