Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: పార్లమెంట్లో రభస కంటిన్యూ అవుతూనే ఉన్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా.. లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన ప్రసంగంపై రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికారపక్ష సభ్యులు ఎదురుదాడి చేస్తున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అదానీ అంశంపై జేపీసీ కోసం పట్టుబట్టారు. ఆ వెంటనే అధికారపక్షం ఎంపీలు కూడా రోజులాగే రాహుల్‌గాంధీ స్పీచ్ అంశాన్ని లేవనెత్తారు. రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో ఎదురుదాడికి దిగారు. దాంతో అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ఇరువర్గాల సభ్యులు పోటాపోటీ నినాదాలతో సభలను హోరెత్తించారు. లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన చేస్తున్న సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో ముందుగా ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఒంటిగంటకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వేర్వేరుగా ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయసభలు తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి.