Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ నియమకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ఆ ఉత్తర్వులను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడిందంటూ హర్షం వ్యక్తం చేశారు హరీష్‌రావు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 మంది ఆశావర్కర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1,540 ఆశాల వర్కర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో హైదరాబాద్‌లో 323, మేడ్చల్‌లో 974, రంగారెడ్డి జిల్లాలో 243 పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఆశాల ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది ప్రభుత్వం.