Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అదుపు తప్పిన పోలీసు వాహనాన్ని ఆపేందుకు ఓ ఎస్సై పెద్ద సాహసమే చేశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే?.. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పలు దఫాలుగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు 16 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి డీసీఎం వ్యానులో ఎక్కించారు. వారికి కాపలాగా బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీసులు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు. వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలో వాహనం ప్రమాదానికి గురైంది. వాహనం నడుపుతున్న డ్రైవర్ హోంగార్డుకు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై వాలిపోయాడు. ఫలితంగా వాహనం అదుపుతప్పి రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు తీస్తోంది. గమనించిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. నడుస్తున్న వాహనం నుంచి కిందికి దూకి వాహనం ముందువైపు పరుగులు తీశారు. డ్రైవర్ కూర్చున్న డోర్ తెరిచి స్టీరింగ్ పట్టుకుని, బ్రేక్ వేశారు. దీంతో వాహనం రోడ్డు పక్కనున్నపెద్ద పూలకుండీని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. అరెస్ట్ చేసిన వారిని మరో వాహనంలో తరలించారు. కాగా, ఘటనలో ఎస్సై కరుణాకర్‌రెడ్డితోపాటు హోంగార్డు రమేశ్, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.