Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మనదేశంలో చిరుతలను దైవంగా భావించే గ్రామం ఒకటుందని మీకు తెలుసా..? అవును.. మీరు చదువుతున్నది నిజమే..రాజస్థాన్‌లోని పాలి జిల్లాల్లోగల బెరా గ్రామంలోని ప్రజలకు చిరుతలను దైవంతో సమానం. అక్కడ కొన్ని దశాబ్దాలుగా చిరుతలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. బావులు, కొండల మధ్య తరచూ అవి గ్రామస్తులకు కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు రోడ్లపై కూడా దర్శనమిస్తాయి. అలాంటి సమయాల్లో గ్రామస్తులు చిరుతలు తమమానాన తాము వెళ్లిపోయే వరకూ ఓపిగ్గా ఎదురు చూస్తారు. ఎలాంటి హానీ తలపెట్టరు. అంతేకాదు.. చిరుతలు అప్పుడప్పుడూ స్థానికులు పెంచుకునే గొర్రెలు, మేకలపై దాడి చేసినా వారు పట్టించుకోరు. పైపెచ్చు.. దాన్ని ఓ గౌరవంగా, శుభసూచకంగా భావిస్తారు. ఒక గొర్రె పోతే అందుకు ప్రతిగా దేవుడు రెండు ప్రసాదిస్తాడని గ్రాస్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే.. చిరుతల పట్ల వారు భక్తిప్రపత్తులతో నడుచుకుంటారు. ఇక చిరుతలు కూడా గ్రామస్థులను ఏమీ చేయకపోవడం ఆ గ్రామానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం. చిరుతలు అత్యధికంగా సంచరిస్తున్న గ్రామంగా బేరా గుర్తింపు పొందింది. దీంతో.. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని జవాయ్ లెపర్డ్ కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. ఇక పర్యాటకులకు చిరుతలను చూపించడానికి సఫారీలు నిర్వహిస్తున్నారు. చిరుత కనిపించని పక్షంలో పర్యాటకులకు డబ్బులు తిరిగిచ్చేస్తామంటూ కొందరు గైడ్స్ చెబుతున్నారంటే అక్కడ చిరుతల సంచారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.