Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను టీటీడీ విడుదల చేసింది. రూ.4,411 కోట్ల వ్యయం అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ తరుణంలో తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 17న నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ బడ్జెట్‌తో పాటు మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై తీర్మానం చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల లడ్డూ విక్రయశాలలో రూ.5.25కోట్లతో మరో 30 కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో మూడో అంతస్తు ఏర్పాటుకు రూ.4.71 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అంతే కాకుండా కొవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని, కొవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1200కోట్ల కానుకలు లభిస్తే ఆ తర్వాత అది రూ.1500 కోట్ల వరకు పెరిగిందన్నారు. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు రేట్లు పెరిగాయని ఆయన వివరించారు. తిరుపతిలోని శ్రీనివాససేతు పనులను ఏప్రిల్‌లోపు పూర్తి చేస్తామన్నారు. అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్త రోడ్డు మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు.