Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ‘మోడీ హఠావో దేశ్ బచావో’ పేరుతో దేశ రాజధానిలో వేల సంఖ్యలో పోస్టర్లు వెలవడం కలకలం సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిపై చర్యలకు ఉపక్రమించిన ఢిల్లీ పోలీసులు.. ఇప్పటివరకు 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
పోస్టర్లకు సంబంధించి ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తోన్న ఓ వ్యానును అడ్డుకున్న పోలీసులు అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉన్న కొన్ని వేల పోస్టర్లను సీజ్ చేశారు. అయితే, ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన సమచారం ఆ పోస్టర్లపై లేదని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. ఇప్పటివరకు 2వేల పోస్టర్లను తొలగించినట్టు ఆయన తెలిపారు. పోస్టర్ల వ్యవహారంపై పోలీసుల చర్యలను ఆప్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్న ఆప్.. ఆ పోస్టర్లలో అభ్యంతరకరం ఏముందని ప్రశ్నించింది. వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపైనా మండిపడింది. భారత్ ప్రజాస్వామ్య దేశమనే విషయం మీకు తెలియకపోవచ్చని.. ఒక్క పోస్టర్కే ఎందుకంత భయం అంటూ ట్వీట్ చేసింది.