Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించనున్నారు. అదే విధంగా చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. భారీ వర్షాలు కురిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కూడిన బృందం వికారాబాద్ జిల్లాల్లో పర్యటించింది. పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు స్వయంగా సీఎం కేసీఆరే క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా వడగండ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మక్కజొన్నతోపాటు భారీస్థాయిలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పంటనష్టానికి సంబంధించిన నివేదికను అధికారులు కేసీఆర్‌కు అందించారు. నివేదికను పరిశీలించిన సీఎం నేరుగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.