Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ప్రతికూల స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో ప్రముఖ కంప్యూటర్ యాక్సెసరీస్ బ్రాండ్ లాజిటెక్ 300 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ అమ్మకాల్లో తగ్గుదల నేపధ్యంలోనే ఉద్యోగులపై వేటు వేసినట్టు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే లాజిటెక్ రాబడి ఏకంగా 21 శాతం పడిపోయింది. దీనికితోడు లాజిటెక్ కీబోర్డులు, కాంబోస్ విక్రయాలు 22 శాతం క్షీణించాయి. అంతర్జాతీయ స్ధూల ఆర్ధిక పరిస్ధితులు ప్రతికూలంగా ఉండటంతో పాటు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడటంతో వ్యాపారంలో తగ్గుదల నమోదైందని లాజిటెక్ ప్రెసిడెంట్, సీఈఓ బ్రాకెన్ డారెల్ పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన ఆర్ధిక పరిస్ధితులు, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్లలో అనిశ్చితి, ద్రవ్యోల్బణం, వ్యయ నియంత్రణ చర్యలు, వినియోగదారులు వెచ్చించే మొత్తం తగ్గడం వంటి పరిస్ధితులే అమ్మకాలు పడిపోవడానికి కారణమని డారెల్ తెలిపారు. లాజిటెక్ సహా పలు టెక్ కంపెనీలు ఇటీవల లేఆఫ్స్ ప్రకటించాయి.
ఆర్ధిక మందగమనం, అనిశ్చితి వాతావరణం వెంటాడుతుండటంతో అమెజాన్, మెటా, గూగుల్, ట్విట్టర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి పలు దిగ్గజ టెక్ కంపెనీలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఇక టెక్ దిగ్గజాల్లో కొలువులు కోల్పోయిన వారు లింక్డిన్ వంటి మాధ్యమాల్లో తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. వీరిలో కొందరికి ఇతర కంపెనీల్లో మెరుగైన అవకాశాలు ముందుకొస్తుండగా మరికొందరు మంచి అవకాశాల కోసం వేచిచూస్తున్నారు. ఇక లేఆఫ్స్ వరం లాంటివని అభివర్ణించిన మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఉద్యోగి ఒకరు కొలువులు కోల్పోయిన వారు మానసికంగా బలంగా ఉండాలని పేర్కొన్నారు.