Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో రూ.330 కోట్ల విలువైన ఆస్తులను కొన్నారని ముంబై కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆ సమయంలోనే భారత దేశంలోని బ్యాంకులు తాము ఆయనకు ఇచ్చిన రుణాలను తిరిగి పొందలేకపోయాయని తెలిపింది. ఈ వివరాలతో సీబీఐ ఓ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించగలిగే స్తోమత మాల్యాకు 2008-2017 మధ్య కాలంలో ఉందని సీబీఐ తెలిపింది. అయితే ఆయన యూరోపు దేశాల్లో వ్యక్తిగత ఆస్తులు కొన్నారని, కొంత సొమ్మును తన పిల్లలకు స్విట్జర్లాండ్లో ఉన్న ట్రస్టులకు బదిలీ చేశారని చెప్పింది.
మాల్యా విదేశీ లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు కోర్టు నుంచి సీబీఐ అనుమతి పొందింది. ఆ తర్వాత వివిధ దేశాలకు లేఖలు రాసింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మాల్యా 35 మిలియన్ యూరోలతో రియల్ ఎస్టేట్ను కొన్నారు. 8 మిలియన్ యూరోలను తన కంపెనీల్లో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుంచి చెల్లించారు. మాల్యా 2016లో భారత దేశం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్లో నివసిస్తున్నారు. ఆయనను తిరిగి భారత దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.