Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ వల్ల ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదేనని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సైతం ఐపీఎల్ అనంతరం జరుగుతుంది. ఈ రెండు కీలక టోర్నమెంట్ల దృష్ట్యా ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలంటే ఒత్తిడి ఉండకూడదు. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ వల్ల ఆటగాళ్లు పనిభారంతో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీమ్ఇండియాకు కీలకమైన ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్.. ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గాయాల కారణంగా బుమ్రా, శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడలేదు. డిసెంబర్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. వన్డేల్లో నిలకడగా పరుగులు సాధించే శ్రేయస్ అయ్యర్ వెన్ను సర్జరీ కారణంగా ఐదు నెలల పాటు అందుబాటులో ఉండడని సమాచారం. ఐపీఎల్ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా గాయాలపాలైతే టీమ్ఇండియా ప్రపంచకప్‌లో రాణించడం కష్టమవుతుంది. కాబట్టి ఆటగాళ్ల పనిభారంపై దృష్టి పెట్టడం ఐపీఎల్ ఫ్రాంచైజీల బాధ్యతేనని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేలా టీమ్ఇండియా యాజమాన్యం ఇప్పటికే సూచనలు చేసిందని తెలిపాడు. ‘‘ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలదే. ఎందుకంటే వారే ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. మేం అన్ని జట్లకు సూచనలిచ్చాం. ప్రపంచకప్ వరకు ఫిట్‌గా ఉండాల్సిన బాధ్యత ఆటగాళ్లదే’’ అని రోహిత్ పేర్కొన్నాడు.