Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నిజామాబాద్: ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ దుష్ట పరిపాలన సాగిస్తున్న బీజేపీని తరిమి కొట్టాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ పిలుపునిచ్చారు. దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా మనుధర్మం ప్రకారం జరగాలని ఆయన విమర్శించారు. వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని... కేంద్రంలోని కాషాయ ప్రభుత్వం దళితులు, గిరిజనులను బతకనీయడం లేదని తెలిపారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన మూడోదశ జనచైతన్యయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ నేతృత్వంలో జనచైతన్య యాత్ర జరుగుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఈ యాత్రను విజయరాఘవన్ ప్రారంభించారు. అనంతరం విజయరాఘవన్ మాట్లాడుతూ మోడీ పేదల కోసం మాట్లాడతాడు. పనులు మాత్రం కార్పొరేట్లకు చేస్తాడని మోడీ నైజాన్ని తెలియజేశారు. పార్లమెంట్ లోనే కాదు. పార్లమెంట్ వెలుపల కూడా మాట్లాడే వారు నేడు దేశానికి అవసరం. అలాంటి వారు సీపీఐ(ఎం)లో ఉన్నారని తెలిపారు. ఈ సభలో యాత్ర నాయకులు జాన్ వెస్లీ మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనేక రకాల మత కలహాలను, గోడవలను సృష్టిస్తోందని అన్నారు. అలాంటి బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న జనచైతన్య యాత్రలు ఈ నెల 29న హైదరాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభతో ముగుస్తాయని వెస్లీ చెప్పారు. హైదరాబాద్ సభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ హజరుకానున్నట్టు తెలిపారు.